అన్ స్టాపబుల్-4 కూడా బాబుతోనే షురూ

ఆహా ఓటీటీలో ప్రసారమైన అన్ స్టాపబుల్-టాక్ షో మూడు సీజన్లు నందమూరి బాలకృష్ణలో మరో కోణం బయటపెట్టాయి. ఆద్యంతం చాలా చలాకీగా, సరదాగా నడిపిస్తూ బాలయ్య అన్ స్టాపబుల్-టాక్ షోని చాలా రక్తి కట్టిస్తున్నారు.

సీజన్‌-3 మొదటి ఎపిసోడ్‌లో ఆయన వియ్యంకుడు నారా చంద్రబాబు నాయుడు అతిధిగా పాల్గొన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆయన అల్లుడు, చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌ కూడా వచ్చి చేరడంతో ముగ్గురూ కలిసి ఆ షో మరింత రక్తి కట్టించారు. 

అక్టోబర్‌ 25 నుంచి అన్ స్టాపబుల్-సీజన్‌4 ప్రారంభం కాబోతోంది. ఈసారి కూడా మొదటి ఎపిసోడ్‌కి మళ్ళీ చంద్రబాబు నాయుడునే అతిధిగా ఆహ్వానించడం విశేషం. ఈసారి చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనుక రాజకీయాలపై బాలయ్య చిలిపి ప్రశ్నలు ఉండక తప్పదు. వాటికి చంద్రబాబు నాయుడు ఏవిదంగా సమాధానం ఇస్తారో చూడాలి. 

ఈ మొదటి ఎపిసోడ్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లోని అన్నపూర్ణా స్టూడియోలో ఆదివారం జరిగింది. దానిలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడురాగా బాలకృష్ణతో పాటు అందరూ ఎదురేగి సాదరంగా ఆహ్వానించారు.

ఈరోజు తొలి ఎపిసోడ్‌ షూటింగ్‌ పూర్తిచేసిన్నట్లు సమాచారం. ఈ తొలి ఎపిసోడ్‌ అక్టోబర్‌ 25న ఆహా ఓటీటీలో ప్రసారం అవుతుంది. ఈ సీజన్‌లో అల్లు అర్జున్‌, సల్మాన్ దుల్కర్ తదితర సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నారు.