
ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు అనన్య నాగళ్ళ. వరద బాధితుల సహాయార్ధం ఆమె రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి విరాళం ఇచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమ్రోగిపోయింది.
కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే పెద్ద హీరోయిన్లు, సీనియర్ నటీమణులు ఎవరూ ముందుకు రాలేదు కానీ సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే నిలద్రొక్కుకొంటున్న అనన్య నాగళ్ళ విరాళం ఇచ్చారని అందరూ ఆమెను ప్రశంశించారు. కానీ సోషల్ మీడియాలో ఉంటే ఫాలోవర్స్, ప్రశంశలతో పాటు విమర్శలు, ట్రోలింగ్ కూడా తప్పదు. కనుక ఆమె అటువంటి సమస్యలు కూడా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.
ఆమె తాజా చిత్రం పొట్టేల్ ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె మీడియా ప్రతినిధులతో ముఖాముఖీ మాట్లాడినప్పుడు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి ప్రశ్నించారు. ఆమె సమాధానం చెపుతూ అటువంటిదేమీ లేదని కొట్టిపడేశారు.
కానీ ఆ మీడియా ప్రతినిధి మళ్ళీ ‘హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాలని అడుగుతారు కదా?’ అని ప్రశ్నించగా, ఆమె సమాధానం చెపుతూ, “మీరు ఊహాజనితమైన ప్రశ్న అడుగుతున్నారు. సినిమాలో నటించేందుకు కమిట్‌మెంట్ ఉండాలి కానీ అవకాశాల కోసం ఎవరికీ కమిట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను సినీ పరిశ్రమలోనే ఉన్నాను. కనుక నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. నాకు అటువంటి సమస్య ఎదురవలేదు. ఎవరికైనా ఎదురైందేమో నాకు తెలీదు,” అని అనన్య నాగళ్ళ సమాధానం చెప్పారు.
సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో ఆమె హీరోయిన్‌గా నటించిన పొట్టేల్ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల కార్యక్రమానికి మరో నటి సంయుక్త ముఖ్య అతిధిగా హాజరయ్యారు.