ఓటీటీలలో కూడా యాడ్స్ బాధ తప్పడం లేదు!

టీవీ న్యూస్, సీరియల్స్ చూసేవారి సహనాన్ని వాణిజ్య ప్రకటనలు పరీక్షిస్తుంటాయి. ఓటీటీలు వచ్చిన తర్వాత వాటి నుంచి విముక్తి లభించింది. ఎటువంటి వాణిజ్య ప్రకటనలు లేకుండా హాయిగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు చూసి ప్రజలు ఆనందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఓటీటీలలో కూడా వాణిజ్య ప్రకటనలు వచ్చేస్తున్నాయి.

ఇప్పటికే ఆహా, డిస్నీ హాట్ స్టార్ ప్లస్ ఓటీటీలో వస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి అమెజాన్ ప్రైమ్‌లో కూడా రాబోతున్నాయి. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ వగైరాలలో కూడా వస్తాయి. కనుక రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదన్నట్లు ఓటీటీలలో కూడా ఈ గోల భరించక తప్పదు.

ఒకవేళ వాణిజ్య ప్రకటనలు లేకుండా చూడాలనుకుంటే మరికొంత సొమ్ము చెల్లించి వేరే ప్లాన్ తీసుకోవలసి ఉంటుంది. అలాగని దానిలో కూడా ఎప్పటికీ వాణిజ్య ప్రకటనలు రావని అనుకోనవసరం లేదు ఓ ఆర్నెల్లో, ఏడాదో గడిచిన తర్వాత దానిలో కూడా వాణిజ్య ప్రకటనలు మొదలుపెట్టి వద్దనుకుంటే మరికొంత సొమ్ము చెల్లించి వేరే ప్లాన్ తీసుకోమని వారే సలహా ఇస్తారు. కనుక ఓటీటీలలో వాణిజ్య ప్రకటనల నుంచి తప్పించుకోవడం ఇక సాధ్యం కాకపోవచ్చు. కనుక భరించాల్సిందే.