బాహుబలి-3 తప్పక ఉంటుంది: జ్ఞానవేల్

రాజమౌళి, ప్రభాస్‌, రానాల బాహుబలి పార్ట్ 1, 2లు సూపర్ హిట్ అవడంతో పార్ట్ 3 కూడా ఉంటుందని రాజమౌళి, నిర్మాత శోభూ యార్లగడ్డలు అప్పుడే చెప్పారు. అయితే ఆ తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ అయిపోయారు. ఇప్పుడు మహేష్‌ బాబు హీరోగా మరో సినిమా మొదలుపెడుతున్నారు.కనుక బాహుబలి-3 ఇక లేన్నట్లే అని అందరూ భావిస్తున్నారు.

కానీ తప్పకుండా ఉంటుందని కోలీవుడ్ నిర్మాత కెఈ జ్ఞానవేల్ చెప్పారు. ఇటీవల తాను రాజమౌళితో మాట్లాడితే మహేష్‌ బాబుతో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత చేద్దామని అన్నారని చెప్పారు. ఆలోగా ప్రభాస్‌ సలార్-2, కల్కి-2 వగైరా సినిమాలు పూర్తి చేస్తారు. 

అవి రిలీజ్ అయ్యే సమయానికి రాజమౌళి-మహేష్‌ బాబు సినిమా చిత్రీకరణ కూడా పూర్తవుతుంది. కనుక అప్పుడు బాహుబలి-3 మొదలుపెడతారని నిర్మాత జ్ఞానవేల్ చెప్పారు. 

ప్రభాస్‌ బాహుబలి-3 కూడా చేయబోతున్నారని జ్ఞానవేల్ చెప్పిన ఈ వార్త విని అభిమానులు చాలా సంతోషిస్తున్నారు. 

ప్రస్తుతం ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా 2025 ఏప్రిల్‌ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇదికాక ప్రభాస్‌ మంచు విష్ణు చిత్రం కన్నప్పలో నందీశ్వరుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ రెండు సినిమాల తర్వాత హనుమాన్‌ రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. రాజాసాబ్ షూటింగ్‌ పూర్తవగానే ఈ సినిమా మొదలుపెట్టబోతున్నారు. దాని తర్వాత లేదా దానితో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమా చేయబోతున్నారు.    

ఆ తర్వాత సలార్‌-2, కల్కి-2 చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయ్యేసరికి బాహుబలి-3 మొదలవుతుంది. అంటే ప్రభాస్‌ మరో 10 ఏళ్ళ వరకు గ్యాప్ లేకుండా సినిమాలు చేయబోతున్నారన్న మాట!అభిమానులకు ఇంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది?