
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఓ క్రేజ్... ఎప్పుడూ ఉంటుంది. మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత సోషియో ఫ్యాంటసీ చిత్రం చేస్తుండటంతో అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్న దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. షరా మామూలుగా అది చాలా అద్భుతంగా ఉందని అందరూ సర్టిఫై చేసేశారు.
కానీ కొన్ని గంటల వ్యవధిలోనే ఆ టీజర్‌లో వీఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా ఉన్నాయని, ముఖ్యంగా చిరంజీవి రెక్కల గుర్రంపై వస్తున్న సీన్ యావరేజ్‌గా ఉందని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. అంతేకాదు... టీజర్‌లో సీన్స్ డ్యూన్, అవెంజర్స్, జూరాసిక్ వరల్డ్ వంటి హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ పేస్ట్ చేసిన్నట్లున్నాయంటూ, సోషల్ మీడియాలో రెంటినీ పక్కపక్కన పెట్టి మరీ చూపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఫైట్స్ కూడా చాలా రొటీన్‌గా ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఆ స్థాయి హీరోతో సోషియో ఫ్యాంటసీ సినిమా అనుకున్నప్పుడు హాలీవుడ్ స్థాయికి తీసిపోకుండా వీఎఫ్ఎక్స్ ఉంటుందని ఆశిస్తామని కానీ ఏదో చుట్టబెట్టేసి రిలీజ్ చేసిన్నట్లుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదివరకు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా టీజర్, ట్రైలర్ విషయాలో కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. అయినా దర్శక నిర్మాతలు వాటిని పట్టించుకోకుండా సినిమా రిలీజ్ చేసి బోర్లా పడ్డారు. కానీ అదే సమయంలో కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తీసిన ‘హనుమాన్’ సినిమా టీజర్, ట్రైలర్ విడుదల చేసినప్పుడు, అందరూ వేనోళ్ళ పొగిడారు. ఆ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరూ చూశారు.
జనవరి 10న విడుదల కావలసిన విశ్వంభర ఎలాగూ వాయిదా పడింది కనుక చాలా సమయం లభించింది. కనుక ఆలోగా విశ్వంభరకి అవసరమైన మార్పులు చేర్పులు చేసుకొని మెరుగులు దిదిద్దుకుంటే మంచిదేమో?