హరిహర వీరమల్లు దసరా పోస్టర్‌

క్రిష్ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌ మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు మళ్ళీ గాడిలో పడింది. రాజకీయాలలో బిజీ అయిపోయిన పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల ఈ సినిమాకు సమయం కేటాయించి విజయవాడలో వేసిన సెట్స్‌లో షూటింగ్లో పాల్గొంటున్నారు. కనుక ఈ సినిమా త్వరలో పూర్తిచేయగలమనే నమ్మకం సినీ నిర్మాణ సంస్థకు ఏర్పడటంతో మార్చి 28న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.

ఈ రోజు దసరా పండుగ సందర్భంగా హరిహర వీరమల్లులో పవన్‌ కళ్యాణ్‌ పోస్టర్‌ విడుదల చేసింది. పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల కాషాయ దుస్తులు ధరించి సనాతన ధర్మ పరిరక్షణ అంటూ మాట్లాడుతుండటంతో తీవ్ర ఆందోళన చెందుతున్న అభిమానులు హరిహర వీరమల్లుగా పవన్‌ కళ్యాణ్‌ పోస్టర్‌ చూసి చాలా సంతోషంగా ఉన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ నుదుటన పెద్ద బొట్టు, చేతిలో విల్లు, ఒకేసారి మూడు బాణాలు సందిస్తున్న ఆ ఫోటో వైరల్ అవుతోంది. హరిహర వీరమల్లు పార్ట్:1 స్వోర్డ్ వెర్సస్ స్పిరిట్ అనే ట్యాగ్ లైన్ ఇచ్చారు.  

ఈ సినిమా షూటింగ్‌ చాలా ఆలస్యం అవడం వలన క్రిష్ బదులు జ్యోతీకృష్ణ దర్శకత్వంలో మిగిలిన సన్నివేశాలు పూర్తిచేస్తున్నారు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా బాలీవుడ్‌ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఇంకా విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.  

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్. 

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.