సంక్రాంతికే గేమ్ ఛేంజర్‌: దిల్‌రాజు

శంకర్-రామ్ చరణ్‌ల మెగా ప్రాజెక్టు ‘గేమ్ ఛేంజర్‌’ సినిమా మళ్ళీ వాయిదా పడింది. ఈ విషయం నిర్మాత దిల్‌రాజు స్వయంగా తెలిపారు. గేమ్ ఛేంజర్‌ డిసెంబర్‌ 20వ తేదీన విడుదల కావలసి ఉండగా జనవరిలో సంక్రాంతి పండుగకు ముందు విడుదల చేస్తామని చెప్పారు. భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల చేస్తే బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లు కూడా చెపుతుండటంతో జనవరిలో విడుదల చేయాలని నిర్ణయించామని దిల్‌రాజు తెలిపారు.

అయితే చిరంజీవి సినిమా విశ్వంభర జనవరి 10న విడుదల కాబోతోంది. కనుక దానిని వాయిదా వేసుకోవాలని తాను అభ్యర్ధించగా చిరంజీవి అంగీకరించారని దిల్‌రాజు చెపుతూ ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకున్నారు. కనుక గేమ్ ఛేంజర్‌ జనవరి 10వ తేదీన విడుదల చేస్తే, విశ్వంభర ఫిబ్రవరి లేదా మార్చికి వాయిదా పడే అవకాశం ఉంది. బహుశః అందువల్లే ఈరోజు విడుదల చేసిన విశ్వంభర టీజర్‌లో సినిమా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేదు. 

ఏ సినిమాకైనా దసరా-దీపావళి పండుగ సీజన్‌, సంక్రాంతి పండుగ సీజన్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాయి. గేమ్ ఛేంజర్‌ సంక్రాంతికి మారినందున సినిమా కాస్త అటూ ఇటూ అయినా కలక్షన్స్‌కి ఢోకా ఉండదు.