నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన కార్తికేయ-2 అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రూ.25 కోట్లతో ఈ సినిమా తీస్తే రూ.300 కోట్లు కలక్షన్స్ రాబట్టింది.
అంతేకాదు ఈ సినిమా ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో జాతీయ అవార్డు కూడా సాధించింది. మంగళవారం ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగియన్ 70వ జాతీయ అవార్డు ప్రధానోత్సవ వేడుకలలో కార్తికేయ-2 సినీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిఖిల్, చందూ మొండేటి ఇద్దరూ ఆ తర్వాత ఆ అవార్డుని ప్రదర్శిస్తూ ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా నిఖిల్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఇది మా సినిమాకి దక్కిన అపూర్వమైన గౌరవంగా భావిస్తున్నాము. ఈ అవార్డు లభించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు.
దీనికి కొనసాగింపుగా కార్తికేయ-3 తీయబోతున్నట్లు నిర్మాత అభిషేక్ అగర్వాల్ చెప్పారు. ఈసారి రూ.100 కోట్ల బడ్జెట్‌తో మరింత గొప్పగా నిర్మిస్తామని చెప్పారు. సముద్రంలో మునిగి ఉన్న ద్వారక నగరం నేపధ్యంతో కార్తికేయ-3 ఉంటుందని సమాచారం.
చందూ మొండేటి ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవిలతో ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నారు. దానిని పూర్తి చేసిన తర్వాత నిఖిల్‌తో కార్తికేయ-3 మొదలుపెడతారు.