జూ.ఎన్టీఆర్‌కి జోడీగా రుక్మిణీ వసంత్?

దేవర తర్వాత జూ.ఎన్టీఆర్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో కన్నడ నటి రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా ఖరారు చేసిన్నట్లు సమాచారం. 

'సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, బీ' సినిమాలలో ఆమె అద్భుతంగా నటించి దర్శకనిర్మాతల దృష్టిలో పడ్డారు. ఆ సినిమాలో ఆమె నటనకు ఉత్తమనటి సైమా అవార్డు అందుకున్నారు కూడా. 

రుక్మిణీ వసంత్ నటన మీద ఆసక్తితో అనేక నాటక రంగంలో ప్రవేశించి అనేక నాటకాలలో నటించి మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్ కాలేజీ నుంచి నటనలో డిగ్రీ చేశారు. నృత్య శిక్షణ కూడా తీసుకోవడంతో ఆమె డాన్స్, నటన, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.  

రుక్మిణీ వసంత్ 2019లో బీర్బల్ కేస్-1 సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలో ప్రవేశించి, అది పూర్తవగానే ‘అప్ స్టార్స్’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లో కూడా బోణీ కొట్టారు. ఆ తర్వాత తమిళంలో విజయ్‌ సేతుపతి, శివ కార్తీకేయన్‌లాటి రెండు సినిమాలు చేశారు. ఆ రెండూ ఈ ఏడాదిలో విడుదల కాబోతున్నాయి. 

వాటి తర్వాత రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా తీయబోతున్న సినిమాకి హీరోయిన్‌గా ఎంపికైన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు జూ.ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందంటే ఇక ఆమె దశ తిరిగిపోయిన్నట్లే. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకి మరో కొత్త (స్టార్) హీరోయిన్‌ వచ్చేసిన్నట్లే.