విజయవాడలో హరిహర వీరమల్లు షూటింగ్‌ ప్రారంభం

పవన్‌ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌ సోమవారం నుంచి విజయవాడలో పునః ప్రారంభం అయ్యింది. 

తొలిరోజు నుంచే పవన్‌ కళ్యాణ్‌‌ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్లో 400 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులతో యుద్ధ సన్నివేశాన్ని హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్‌ నిక్ పావెల్ దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. దీనికోసం ఆర్ట్ డైక్రేటర్ తోట తరణి విజయవాడలో భారీ సెట్ వేశారు. 

ఈ సినిమాని క్రిష్ దర్శకత్వంలో 75 శాతం పూర్తి చేసిన తర్వాత పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలో బిజీ అయిపోవడంతో ఈ సినిమాని పూర్తిచేయలేకపోయారు. కనుక ఆయన స్థానంలో జ్యోతీకృష్ణ దర్శకత్వంలో మిగిలిన సినిమా షూటింగ్‌ పూర్తి చేస్తారు. 

సుమారు ఏడాది తర్వాత మళ్ళీ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవడం, దానిలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొంటుండటంతో అభిమానుల ఆనందానికి హద్దే లేదు. 

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఈ సినిమాని 2025 మార్చి 28వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించడంతో అభిమానులలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. 

ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తుండగా, బాలీవుడ్‌ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఇంకా ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్ చేస్తున్నారు.        

హరిహర వీరమల్లు సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్ మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. 2025, మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.