దేవరకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌

జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన దేవర సినిమా మరో మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి తెలంగాణ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసింది. దేవర నిర్మాణ సంస్థ అభ్యర్ధన మేరకు ఈ సినిమా టికెట్‌ ధరలు పెంచుకునేందుకు, స్పెషల్ షోలు ప్రదర్శించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. 

జీవో ప్రకారం సినిమా విడుదలైన రోజు అంటే సెప్టెంబర్‌ 27వ తేదీ అర్ధరాత్రి 29 థియేటర్లలో అర్ధరాత్రి ఓ ప్రత్యేక షో వేసుకునేందుకు, అన్ని థియేటర్లలో తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 షోలు వేసుకునేందుకు అనుమతి లభించింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్‌ 6వరకు ఈ స్పెషల్ షోలు వేసుకునేందుకు, వాటికి అదనపు టికెట్‌ ఛార్జీలు వసూలు చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. 

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్‌ చార్జీలపై అదనంగా రూ. 25, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.50 చొప్పున పెంచుకునేందుకు అనుమతించింది. 

ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వీటి కోసం జీవో జారీ చేసింది. ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ టికెట్‌ ఛార్జీ రూ.110, లోవర్ క్లాస్ ఛార్జీ రూ.60, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.135 వరకు పెంచుకునేందుకు అనుమతించింది.