టాలీవుడ్లో జానీ మాస్టర్ వ్యవహారంపై చిన్నగా యుద్ధాలు జరుగుతుండగానే, తిరుమల లడ్డూ వ్యవహారంలో మా అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ మద్య మరో కొత్త యుద్ధం మొదలైంది.
ఈ అంశంపై ప్రకాష్ రాజ్ వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని తప్పు పడుతూ మంచు విష్ణు కాస్త ఘాటుగానే ‘గీత దాటొద్దు’ అంటూ హెచ్చరించారు. దానికి ఆయన కూడా వ్యంగ్యంగా “ఓకే శివయ్యా... నా దృష్టికోణం నాది .. నీ దృష్టికోణం నీది. నోటడ్ #జస్ట్ ఆస్కింగ్,” అంటూ ట్వీట్‌తో బదులిచ్చారు.
ఈ తిరుపతి లడ్డూ వ్యవహారం మీదనే వారిద్దరూ కత్తులు దూసుకుంటున్నారా అంటే కాదనే అందరికీ తెలుసు. మూడేళ్ళ క్రితం జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో వారిద్దరూ పోటీ పడినప్పుడు పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకున్నారు.
కానీ ఆ ఎన్నికలలో మంచు విష్ణు గెలిచారు. ఆ తర్వాత ఎన్నికలలో కూడా మళ్ళీ మంచు విష్ణుయే గెలిచి మా అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.
కానీ ఆనాడు ఎన్నికలలో వారిద్దరి మద్య ఏర్పడిన దూరం, దురాభిప్రాయాలు ఇంకా వారిలో ఉండిపోవడం వలననే ఇలాంటి సందర్భాలలో కత్తులు దూసుకుంటారని సరిపెట్టుకోవలసి ఉంటుంది.