
నాని, ఎస్జె సూర్య ప్రధాన పాత్రలలో ‘సరిపోదా శనివారం’ మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకొని హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 26 నుంచి నెట్ఫ్లిక్స్లో ప్రసారం కాబోతోంది. ఈ సినిమాలో నానికి జోడీగా ప్రియాంక మోహన్ నటించగా, సాయి కుమార్, అభిరామి, అదితి బాలన్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమా కధ ఏమిటంటే, చిన్నప్పటి నుంచి సూర్య (నాని)కి కోపం ఎక్కువ. ఆ కారణంగా ప్రతీరోజూ ఎవరో ఒకరితో గొడవలు పడుతుంటాడు. అతని కోపాన్ని అదుపులో పెట్టడానికి తల్లి ఛాయాదేవి (అభిరామి) చనిపోయే ముందు కొడుకు దగ్గర మాట తీసుకుంటుంది.
ఆ కారణంగా సూర్య వారం రోజులలో ఎవరి మీద ఎంతగా కోపం వచ్చిన నిగ్రహించుకుంటూ ఒక్క శనివారం మాత్రమే వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. అయితే సూర్య పెరిగి పెద్దయ్యేసరికి ఈ పద్దతి వలన తండ్రి (సాయికుమార్, అక్క (అదితి) ఇంకా పెద్ద సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంటుంది.
సూర్య జాబితాలోకి చాలా క్రూరుడని పేరొందిన సీఐ దయానంద్ (ఎస్జె సూర్య) పేరు చేర్చడంతో అసలు కధ మొదలవుతుంది. దయానంద్కి తన సొంత అన్న కూర్మానంద్ (మురళీశర్మ)తో వైరం ఉంటుంది.
ఈ ముగ్గురు పాత్రల మద్య జరిగిన ఘర్షణ ఈ సినిమా కధ. నాని, ఎస్ జె సూర్య పోటీపడి నటించి ప్రేక్షకులను కట్టిపడేయడంతో సినిమా హిట్ అయ్యింది. ఇప్పుడు ఇది ఓటీటీ ప్రేక్షకుల కోసం ఈనెల 26 నుంచి నెట్ఫ్లిక్స్లో వచ్చేస్తోంది.