
జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా ఈ నెల 27న విడుదల కాబోతున్న దేవర సినిమాకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిర్మాణ సంస్థ అభ్యర్ధన మేరకు సినిమా టికెట్ ఛార్జీలు పెంచుకోవడానికి, ప్రత్యేక షోలు వేసుకోవడానికి అనుమతించింది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా అనుమతించాల్సి ఉంది.
సెప్టెంబర్ 27న దేవర విడుదలైన రోజున అర్దరాత్రి 12 గంటల షోతో కలిపి ఆరు షోలకు అనుమతించింది. మరుసటి రోజు నుంచి తొమ్మిది రోజులు అంటే అక్టోబర్ 6వరకు రోజుకి 5 షోలు వేసుకునేందుకు అనుమతించింది.
థియేటర్లలో మొదటి 14 రోజులు టికెట్ ధరలు పెంపుకి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. మల్టీప్లెక్స్‌లో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలపై అదనంగా మరో రూ.135 వరకు పెంచుకునేందుకు అనుమతించింది. అంటే రూ.175 టికెట్‌కి రూ.310 చెల్లించాల్సి ఉంటుందన్న మాట!
ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరపై అప్పర్ క్లాస్ రూ.110, లోవర్ క్లాస్ రూ.60 చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది.
రేపు (ఆదివారం) దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రేపు అర్ధరాత్రి నుంచి లేదా సోమవారం ఉదయం నుంచి ప్రారంభం కాబోతున్నాయి.