
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ శుభవార్త. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభించిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మళ్ళీ ఈ నెల 23 నుంచి మొదలవబోతోంది.
పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పంచాయితీరాజ్ శాఖ మంత్రిగా చాలా బిజీగా ఉన్నందున ఆయన కోసం విజయవాడలోనే సెట్ వేసి షూటింగ్ చేసేందుకు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం నుంచి పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేయాల్సిన సన్నివేశాలకు సుమారు 20 రోజులు సమయం కేటాయిస్తే సరిపోతుంది. కానీ రాజకీయాలలో బిజీ అయిపోవడంతో ఇంతకాలం షూటింగ్లో పాల్గొనలేకపోయారు. ఈసారి ఈ సినిమాలో తన పాత్రకి సంబందించి సన్నివేశాలన్నీ పూర్తయ్యేవరకు అంటే 20 రోజులు షూటింగ్లో పాల్గొనబోతున్నారని సమాచారం.
వాటిలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకుగాను హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పాల్ నేడు విజయవాడ చేరుకోబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవడంతో క్రిష్ స్థానంలో జ్యోతీకృష్ణ దర్శకత్వం చేయబోతున్నారు.
రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి భాగంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.