దేవరకి ఆ పేరు ఎందుకంటే... జూ.ఎన్టీఆర్‌

జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌, సైఫ్ ఆలీఖాన్ ప్రధాన పాత్రలలో వస్తున్న దేవర ఈ నెల 27న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్‌ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమ సినిమా గురించి కొత్త కొత్త విశేషాలు చెపుతున్నారు. 

తాజా ఇంటర్వ్యూలో, “మా సినిమాకి ఆర్ఆర్ఆర్‌లాగ మంచి క్యాచీ టైటిల్‌ పెట్టాలనుకున్నాము. అందుకే దేవరని ఎంచుకున్నాము. మా సినిమా స్క్రిప్ట్ తయారయ్యే వరకు కూడా హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ని అనుకోలేదు. కానీ కరణ్ జోహర్ ఫోన్‌ చేసి ఆమె ఓ అద్భుతమైన నటి అని మన సినిమాకి తీసుకుంటే బాగుంటుందని చెప్పడంతో తీసుకున్నాము. జాన్వీ కపూర్‌ మొదట్లో కాస్త కంగారు పడినా తర్వాత చాలా వేగంగా అన్నీ నేర్చుకొని ఆయన చెప్పిన్నట్లే జాన్వీ కపూర్‌ చాలా అద్భుతంగా నటించింది. ముఖ్యంగా ఆమె డైలాగ్స్ గుర్తుంచుకొని చెప్పడంలో మెమొరీ పవర్, డ్యాన్స్ చాలా అద్భుతం. 

జైలర్, విక్రమ్, మాస్టర్‌ వంటి పెద్ద చిత్రాలకు అనిరుధ్ అద్భుతమైన సంగీతం అందించారు. సినిమాకి సంగీతం ఎంత ముఖ్యమో అతనికి బాగా తెలుసు. మా సినిమాలో ఆయన  సంగీతం హైలైట్ కాబోతోంది. అనిరుధ్ కూడా ఏఆర్ రహమాన్ అంత గొప్ప సంగీత దర్శకుడు అవుతారు,” అని అన్నారు. 

“దేవర సినిమా కోసం అందరం కష్టపడి పనిచేశాము. ఎక్కడా రాజీ పడకుండా తీయడంతో సినిమా చాలా బాగా వచ్చింది. కనుక దేవర సూపర్ హిట్ అవుతుందని మా అందరికీ నమ్మకముంది. అయినప్పటికీ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే కాస్త ఆందోళనగా ఉంది,” అని జూ.ఎన్టీఆర్‌ అన్నారు.