కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన బృందంలోని ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యవహారంపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతో టాలీవుడ్లో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనిపై టాలీవుడ్ తరపున నిన్న ప్రెస్మీట్ పెట్టి వివరణ ఇచ్చిన సీనియర్ నటి ఝాన్సీ, ఈరోజు మళ్ళీ ఫిలిమ్ ఛాంబర్లో ప్రెస్మీట్ పెట్టి, ఈ అకృత్యాలను ఖండిస్తున్నామని, సినీ పరిశ్రమలో మహిళలకు భద్రత చాలా అవసరమని భావిస్తున్నామని అన్నారు.
ఈ వ్యవహారంపై ఇప్పటికే బాధితురాలు, నిందితుడు వాంగ్మూలాలు తీసుకొని విచారణ జరిపి బలమైన సాక్ష్యాధారాలు సేకరించామని చెప్పారు. అయితే మీడియాలో కొందరు సున్నితమైన ఈ అంశంలో గోప్యతా పాటించకుండా బాధితురాలి పేరు, ఫోటో ప్రచురించడాన్ని ఝాన్సీ తప్పు పట్టారు. మీడియా సంయమనం పాటిస్తూ, ఈ కేసు విచారణకు సహకరించాల్సిందిగా అభ్యర్ధించారు.
త్వరలోనే తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అంతా వివరించి విచారణ జరిపించమని కోరుతామని చెప్పారు. అయితే ఆ అమ్మాయి 5 ఏళ్ళుగా వేధింపులకు గురవుతుంటే ఇండస్ట్రీలో ఏ ఒక్కరికీ తెలియదంటే నమ్మశక్యంగా లేదు. కనుక ఇది తెలిసీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా విచారణ పేరుతో రాజీ ప్రయత్నాలు చేయడం లేదా కాలక్షేపం చేయడాన్ని టాలీవుడ్ ఏవిదంగా సమర్ధించుకోగలదు?
(Video Courtecy: RTV)