ఆనాడు కమల్ హాసన్, రజనీకాంత్, జయలలిత మొదలు నేడు కార్తీ, విజయ్ వరకు తమిళ నటీనటులు చాలామంది చాలా తెలుగు సినిమాలు చేశారు. కానీ అదే నిష్పత్తిలో తెలుగు నటీనటులు తమిళ సినిమాలు చేయలేదనే చెప్పాలి. గతంలో చేసినా ఇప్పుడు అగ్రనటులు ఎవరికీ అంత సమయం ఉండటం లేదు. కనుక తెలుగులో తీసి వాటి తమిళం డబ్బింగ్తో సరిపెట్టేస్తున్నారు.
కొరాటాల దర్శకత్వం జూ.ఎన్టీఆర్ హీరోగా చేసిన ‘దేవర’ సినిమాని కూడా అలాగే విడుదల చేస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం జూ.ఎన్టీఆర్ చెన్నై వెళ్ళినప్పుడు, తమిళ సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్న వస్తే నేను సిద్దంగానే ఉన్నానని జూ.ఎన్టీఆర్ జవాబు చెప్పడం విశేషం. తాను తమిళ దర్శకుడు వెట్రీమారన్తో కలిసి స్ట్రెయిట్ తమిళ సినిమా చేయడానికి సిద్దంగా ఉన్నానని, దానిని తెలుగులో డబ్బింగ్ చేద్దామని జూ.ఎన్టీఆర్ చెప్పారు.
వెట్రీమారన్ అంటే తనకు చాలా ఇష్టమని ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, ఆయన ఎప్పుడు చేద్దామంటే అప్పుడు నేను కూడా సిద్దంగా ఉంటానని జూ.ఎన్టీఆర్ చెప్పారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో జూ.ఎన్టీఆర్ అభిమానులకి కూడా చాలా సంతోషం కలిగించేదే.
నిజానికి వారిరువురూ కలిసి సినిమా చేయాలని, చేస్తారని చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇద్దరూ ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉండటంతో ఇంతవరకు వీలుపడలేదు. ఇప్పుడు జూ.ఎన్టీఆర్ స్వయంగా ఆయనతో తమిళ సినిమా చేసేందుకు సిద్దమని ప్రకటించారు కనుక త్వరలోనే వారి సినిమాకి బీజం పడవచ్చు.