
చిరంజీవి, రామ్ చరణ్ వంటి అతి పెద్ద స్టార్స్ కొరటాల శివకు అవకాశం ఇస్తే ‘ఆచార్య’తో అందరినీ నిరాశ పరిచారు. ఆయనతో జూ.ఎన్టీఆర్ దేవర సినిమా మొదలుపెట్టగానే అభిమానులు చాలా ఆందోళన చెందారు.
అయితే నేడు విడుదలైన ట్రైలర్ చూస్తే వారి భయాలన్నీ పటాపంచలైపోవడం ఖాయం. ట్రైలర్ అంత అద్భుతంగా ఉంది. అది చూస్తే కొరటాల శివ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేశారనిపిస్తుంది.
దేవరలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పూర్తికాక మునుపే రామ్ చరణ్‌తో ఒకటి నానితో మరొక సినిమా చేసేందుకు ఒప్పుకుంది. ఈ నెల 27న విడుదల కాబోతున్న దేవర సూపర్ హిట్ అయితే ఆమెతో సహా కొరటాల శివ కూడా ఒడ్డున పడతారు.
దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్, షైన్ టామ్ చాకో తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు. ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బెట్స్ పనిచేస్తున్నారు.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు.