దేవర ట్రైలర్‌ రిలీజ్ ముందు రామజోగయ్య ట్వీట్‌...

ఈరోజు (మంగళవారం) సాయంత్రం 5.06 గంటలకు విడుదల కాబోతున్న దేవర సినిమా ట్రైలర్‌ కోసం అభిమానులు అందరూ మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లతో ఆత్రంగా ఎదురు చూస్తుంటే, ఆ సినిమాకి పాటలు అందించిన రామజోగయ్య శాస్త్రి కొద్ది సేపటి క్రితం ఓ ట్వీట్‌ చేశారు. 

“సముద్రం అతడి పాదాక్రాంతం సమయం అతడి ఆయుధహస్తం భయోద్విగ్నం అతడి ప్రవేశం ఈసాయంత్రం మొదలు.... దేశం దేవర కైవసం దేశం దేవర కైవసం దేశం దేవర కైవసం” అంటూ ఇది దేవర గురించే అని చెప్పేశారు. దీంతో జూ.ఎన్టీఆర్‌ అభిమానులు సంతోషంతో ఉప్పొంగి పోతున్నారు. 

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా ‘దేవర’ మొదటి భాగం ఈ నెల 29న విడుదల కాబోతోంది. దేవరలో బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్‌, షైన్ టామ్ చాకో తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్‌. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.  ఈ సినిమాకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ కెన్నీ బెట్స్ పనిచేస్తున్నారు. 

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు.