సెప్టెంబర్ 1 నుంచి అన్ని సినిమా షూటింగ్స్ బంద్ కాబోతున్నాయి. అయితే టాలీవుడ్లో కాదు... కోలీవుడ్లో నటీనటుల పారితోషికాలు, మితిమీరుతున్న వారి అదనపు వ్యాయాలు, ఓటీటీ, శాటిలైట్ హక్కులు తదితర అంశాలపై అర్దవంతమైన చర్చలు జరిపి నిర్ణయం తీసుకునే వరకు నవంబర్ 1 నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేయబోతున్నట్లు తమిళ సినీ నిర్మాతల మండలి ప్రకటించింది.
అయితే ఇటువంటి తొందరాపాటు నిర్ణయం తీసుకోవద్దని తమిళ నడిగర్ సంఘం విజ్ఞప్తి చేసింది. దాని ఉపాధ్యక్షుడు పూచ్చి మురుగన్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు తేనండాల్ మురళి రామస్వామి నేతృత్వంలో ఇరు కమిటీలు గత నెల 18న సమావేశమయ్యి చర్చించి ఒప్పంద పత్రాలు కూడా మార్చుకున్నారు.
కానీ ఆ తర్వాత ధనుష్ తదితర నటులు మరికొన్ని సమస్యలని కూడా ఇప్పుడే పరిష్కరించాలని ఒత్తిడి చేయడంతో, మళ్ళీ మరోసారి ఇరు కమిటీలు సమావేశం అవ్వాలని నిర్ణయించారు. సమస్యలపై చర్చించి పరిష్కరించుకునేందుకు తాము సిద్దంగా ఉన్నప్పుడు ఈవిదంగా షూటింగ్లు నిలిపివేస్తామని ముందే ప్రకటించి చర్చలు జరపడం సరికాదని నడిగర్ సంఘం సభ్యులు వాదిస్తున్నారు. కనుక ఆ ప్రకటన ఉపసంహరించుకోవాలని నడిగర్ సంఘం విజ్ఞప్తి చేస్తోంది.
ఇది వరకు టాలీవుడ్లో కూడా ఇంచుమించు ఇటువంటి సమస్యలతోనే నిర్మాతల మండలి నెలరోజులు సినిమా షూటింగ్లు నిలిపివేసింది. కానీ ఆ తర్వాత సమస్యలు పరిష్కారం అయ్యయా? అంటే అయ్యాయని చెప్పలేని పరిస్థితి నెలకొంది. మరి అటువంటప్పుడు సినిమా షూటింగ్లు నిలిపివేసి అందరూ నష్టపోవడం దేనికి?