కానిస్టేబుల్‌గా వస్తున్న వరుణ్ సందేశ్

శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ సినిమాతో పరిచయమైన నటీనటులలో తమన్నా, నిఖిల్ సినీ పరిశ్రమలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోగలిగారు. ఆ సినిమాలో నటించిన వరుణ్ సందేశ్ తదితర పలువురు నటులకు కూడా అనేక మంచి అవకాశాలు వచ్చాయి. కానీ వాటిని అందిపుచ్చుకొని రాణించలేకపోయారనే చెప్పొచ్చు. 

మళ్ళీ చాలా కాలం తర్వాత వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆర్యన్ సుభాస్ దర్శకత్వంలో జాగృతీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై బలగం జగదీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త హీరోయిన్‌ మధులిక వారణాసి వరుణ్ సందేశ్‌కి జోడీగా నటిస్తోంది.

ఈ సినీ నిర్మాత బలగం జగదీష్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేయడం విశేషం. ఆయనతో పాటు దువ్వాసి మోహన్, సూర్య, రవివర్మ, మురళీధర్ గౌడ్, ప్రభావతి, నిత్యశ్రీ, కల్పలత, శ్రీభవ్య తదితరులు నటిస్తున్నారు. కానిస్టేబుల్ సినిమా మోషన్ పోస్టర్ నిన్న విడుదలచేశారు. 

కానిస్టేబుల్ సినిమాకి కధ, దర్శకత్వం: ఆర్యన్ సుభాన్ ఎస్‌కె; సంగీతం: సుభాష్ ఆనంద్ గ్యాని; కెమెరా: హజరత్ అలీ; ఎడిటింగ్: శ్రీ వరప్రసాద్; కొరియోగ్రఫీ: భాను, విశ్వ రఘు, స్వర్ణ; ఆర్ట్: వి నాని పండు; స్టంట్: రామ్ సుంకర;   విఎఫ్ఎక్స్: రైజ్ విఎఫ్ఎక్స్.    

నిర్మాత జగదీష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో వరుణ్ సందేశ్ అద్భుతంగా నటించారు. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ ఇది. కధ, కధనాలు చాలా బాగా కుదిరాయి,” అని చెప్పారు.