సినీ ఇండస్ట్రీలో పెద్దగా అనుభవం లేని యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ, పెద్దగా గుర్తింపు లేని యువనటుడు తేజా సజ్జాతో కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో ‘హనుమాన్’ తీసి ప్రశంశలు అందుకుంటే, రూ.600 కోట్లు ఖర్చు చేయించి ప్రభాస్, సైఫ్ ఆలీఖాన్ వంటి పెద్ద హీరోలతో ‘ఆదిపురుష్’ వంటి సినిమా తీసినందుకు దర్శకుడు ఓం రౌత్‌పై ఎన్ని విమర్శలు వచ్చాయో అందరూ చూశారు.
అయితే ప్రజలు అక్కడితో దాని గురించి మరిచిపోయారు కానీ దర్శకుడు ఓం రౌత్ మాత్రం ఆ గాయాన్ని కెలుకుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఆయన తాజా ఇంటర్వ్యూలో, “ఆదిపురుష్ సినిమాపై ఊరూ పేరూ లేని అనామకులు ఎన్ని విమర్శలు చేసినా నేను పట్టించుకోను. ఎందుకంటే ఆ సినిమా విడుదలైన తొలిరోజే దేశవ్యాప్తంగా రూ.70 కోట్లు కలెక్షన్ రాబట్టింది. మొత్తం రూ.400 కోట్ల కలక్షన్స్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచే రూ.200 కోట్లు రాబట్టింది. అంటే సినిమాని ప్రేక్షకులు ఆదరించారనే కదా అర్ధం. అటువంటప్పుడు అనామకులు చేసే విమర్శలను పట్టించుకోవలసిన అవసరం ఉందా?” అని దర్శకుడు ఓం రౌత్ ప్రశ్నించారు.
ఓం రౌత్ తాజా వ్యాఖ్యలతో మళ్ళీ సోషల్ మీడియాలో ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. వాటిని ఆయన పట్టించుకోకపోవచ్చు. కానీ మళ్ళీ జీవితంలో ఆయనకు ఇటువంటి గొప్ప అవకాశం మరోసారి లభిస్తుందా?ఆలోచించుకుంటే మంచిది.