
మలయాళ చిత్రసీమలో కూడా మహిళా నటులు, ముఖ్యంగా హీరోయిన్లు సాటి నటులు, దర్శక, నిర్మాతల నుంచి లైంగిక వేధింపులకు గురవుతున్నారంటూ కేరళ ప్రభుత్వం నియమించిన జస్టిస్ హేమ కమిటీ ఇటీవల నివేదిక విడుదల చేసింది.
దానిలో పలువురు నటులు, దర్శక నిర్మాతల పేర్లు ఉండటంతో మలయాళ చిత్ర సీమలో ఆ నివేదిక ప్రకంపనలు పుట్టిస్తోంది. ఆ నివేదికలో పేర్కొన్న కొందరు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)లో కూడా ఉన్నారు. దీంతో అమ్మ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న ప్రముఖ నటుడు మోహన్ లాల్‌తో సహా 17 మంది సభ్యులు నేడు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేసి తప్పుకున్నారు.
మలయాళ చిత్ర సీమలో ఇటువంటి అనైతిక పనులు జరుగుతుండటం సిగ్గుచేటు అని దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తామందరం రాజీనామా చేస్తున్నామని మోహన్ లాల్ చెప్పారు. త్వరలోనే మళ్ళీ ఎన్నికలు నిర్వహించి ‘అమ్మ’ కమిటీ ఏర్పడుతుందని చెప్పారు.