సరిపోదా శనివారం... ప్రీ రిలీజ్ ఈవెంట్

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాని, ప్రియాంకా మోహన్ జంటగా నటించిన చిత్రం సరిపోదా శనివారం సినిమా ఈ నెల 29న విడుదల కాబోతోంది. కనుక శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ కార్యక్రమం జరిగింది. 

ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ, “కోవిడ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకి రావడం తగ్గించేశారని చాలా మంది చెపుతుంటారు. కానీ మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకి వస్తారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్లు కలిసొచ్చే కాలానికి నడిచొస్తున్న సినిమా మా ఈ సరిపోదా శనివారం. 

ఈ సినిమా నిర్మాత డీవీవీ దానయ్యగారిని వెతుక్కుంటూ వచ్చింది. దర్శకుడు వివేక్‌ ఆత్రేయ కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోబోతోంది. ఇక సూర్యకి కూడా ఇదో మైలురాయి కాబోతోంది,” అని అన్నారు. 

దర్శకుడు వివేక్‌ ఆత్రేయ మాట్లాడుతూ, “అంటే సుందరానికీ’ సినిమా తర్వాత నా పరిస్థితి ఏమిటో నాకే అర్దం కాలేదు. మరో సినిమా చేయగలనా లేదా అనుకుంటున్నవేళ నాని వచ్చి నాకు ఈ ఆఫర్ ఇచ్చి నాలో ఆత్మవిశ్వాసం పెరిగేలా చేశారు. ఇందుకు నానికి నేను ఎప్పటికీ ఋణపడి ఉంటాను. 

ఈ సినిమాతో నాని మరింత ఉన్నతస్థాయికి వెళతారని ఖచ్చితంగా చెప్పగలను. ఎస్‌జె సూర్య కూడా ఈ సినిమా తర్వాత తెలుగులో మరిన్ని సినిమాలు చేయడం ఖాయం. ఈ సినిమాలో నాని, ఎస్‌జె సూర్య పోటీ పడి నటించారు. ప్రేక్షకులకి కూడా ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని, సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాను,” అని అన్నారు.