మహేష్‌ బాబు-రాజమౌళి సినిమా టైటిల్‌ గరుడ?

మహేష్‌ బాబు 29వ చిత్రం దర్శకుడు రాజమౌళితో చేస్తున్న సంగతి తెలిసిందే. కనుక ఆ సినిమా కోసం మహేష్‌ బాబు పూర్తి భిన్నమైన రూపురేఖలతో కనిపించబోతున్నట్లు చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తునే ఉన్నాయి.

కానీ రాజమౌళి సినిమా అంటే ఆ సినిమాలో నటిస్తున్న హీరో, హీరోయిన్లతో సహా ఎవరూ రెండు మూడేళ్ళు ఎవరికీ కనిపించరు. ఆ సినిమాకి సంబందించి ఏ విషయమూ బయటకు పొక్కకుండా ప్రతీదీ అత్యంత రహస్యంగానే ఉంచబడుతుంది. కనుక రాజమౌళి స్వయంగా చెపితే తప్ప ఆ సినిమా గురించి ఎవరికీ ఏమీ తెలియదు.   

ప్రస్తుతం ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయనే విషయం తప్ప మరేదీ తెలియదు. కనుక ఎప్పటిలాగే ఈ సినిమాపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి... వాటితోనే అభిమానులు సంతృప్తి పడక తప్పడం లేదు.

తాజాగా సినిమాకి విజువల్ డెవలప్‌మెంట్‌ ఆర్టిస్ట్ విజయన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎస్ఎస్ఎంబి29 అంటూ మహేష్‌ బాబు ఫోటో, దాని పక్కనే బంగారు రంగులో ఉన్న (గరుడ) పక్షి రెక్కలు పెట్టారు. గతంలో రాజమౌళి కూడా గరుడ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. కనుక మహేష్‌ బాబుతో చేయబోతున్న సినిమా టైటిల్‌ గరుడ అయ్యి ఉండవచ్చని విజయన్ సూచిస్తున్నట్లే ఉంది. కానీ దీనిపై రాజమౌళి టీమ్‌ ఇంకా స్పందించలేదు.