హేమకి మా క్లీన్ చిట్ ఇచ్చేసిందిగా!

ప్రముఖ తెలుగు సినీ నటి హేమపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు శుక్రవారం ప్రకటించారు. ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని రుజువు కాలేదు కనుక అసోసియేషన్ సభ్యులతో చర్చించి సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లుమంచు విష్ణు చెప్పారు. అయితే ఈ విషయం గురించి అసోసియేషన్ స్వయంగా మీడియాకు తెలియజేస్తుంది కనుక ఆమె మీడియాతో దీని గురించి మాట్లాడకూడదని ‘మా’ ఆంక్ష విధించింది. 

సుమారు రెండు నెలల క్రితం బెంగళూరు శివారులో ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమతో సహా 98 మంది ప్రముఖులు, వారి బంధు మిత్రులు పట్టుబడ్డారు. వారిలో హేమతో సహా కొంతమంది మాదకద్రవ్యాలు సేవించిన్నట్లు బెంగళూరు పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో హేమ కొన్ని రోజులు బెంగళూరు జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు కూడా. తర్వాత బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చారు. 

అయితే తాను ఎటువంటి మాదకద్రవ్యాలు తీసుకోలేదని చెపుతూ ఓ ల్యాబ్ రిపోర్ట్ ‘మా’కి సమర్పించి తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని హేమ విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించింది. కనుక హేమకు మా క్లీన్ చిట్ ఇచ్చిన్నట్లే భావించవచ్చు. కానీ బెంగళూరు పోలీసులు కూడా ఇవ్వాలి కదా?