మిస్టర్ బచ్చన్‌లో ఆ మార్పులు చేసి ఉంటే... విశ్వప్రసాద్ కామెంట్స్

రవితేజ, హరీష్ శంకర్‌ ఇద్దరూ మాస్ ప్రేక్షకులను అలరించగలవారే కనుక వారిద్దరూ కలిసి చేసిన మిస్టర్ బచ్చన్‌ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ భావించారు. కానీ సినిమాకి మిశ్రమ స్పందన రావడంతో తీవ్ర నిరాశ ఎదురైంది. దీనిపై ఆ సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. 

తన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లోనే నిర్మిస్తున్న ‘రాజాసాబ్’ గురించి మీడియా ప్రతినిధులకు అప్‌డేట్‌ ఇస్తున్నప్పుడు మిస్టర్ బచ్చన్ సినిమా ప్రస్తావన వస్తే, “ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ సినిమా గురించి ఎక్కువ మాట్లాడితే అది సినిమాపై ప్రభావం చూపుతుంది. 

నేను కూడా థియేటర్లో ఈ సినిమా చూశాను. ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్‌లో కొన్ని మార్పులు చేసి ఉంటే ఫలితం మరోలా వచ్చేదనిపించింది, మేము ప్రతీ సినిమా ప్రేక్షకులకు నచ్చేలాగే తీయాలని ప్రయత్నిస్తుంటాము. అప్పుడే ఆ సినిమా హిట్ అవుతుంది. మాకు తృప్తి కలుగుతుంది. పెట్టిన పెట్టుబడి, లాభాలు వస్తాయి కదా? 

ఎవరూ కోరుండి చెత్త సినిమాలు తీయాలనుకోరు. సినిమా బాగా ఆడుతుందనే నమ్మకంతోనే మొదలుపెట్టి తీస్తాము. కానీ ఒక్కోసారి మా అంచనాలు తప్పుతుంటాయి. మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే కొన్ని రివ్యూలు ఈ సినిమాపై తీవ్ర ప్రభావం చూపాయి,” అని అన్నారు.                 

రాజాసాబ్ సినిమాకి సంబందించి ఎటువంటి అప్‌డేట్స్ ఇవ్వకుండా, ప్రచారం చేయకుండా సినిమా షూటింగ్‌ చేస్తుందతంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, “మా రాజాసాబ్ నిశబ్ధంగా వచ్చి హిట్ కొడతాడు. కల్కి ఎడి2898తో ప్రభాస్‌ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది.

మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజాసాబ్ కూడా పెద్ద సినిమాయే. దీని కోసం 32,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ సెట్ వేశాం. ఇంతవరకు మన దేశంలో ఏ సినిమాకి ఇంత పెద్ద సెట్ వేయలేదు.

రాజాసాబ్ కూడా కల్కి ఎడి2898లా గొప్ప హిట్ అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ సినిమాలో మ్యూజిక్, ఫైట్స్, వీఎఫ్ఎక్స్ అన్ని మరో లెవెల్లో ఉంటాయి. రాజాసాబ్‌ని అందరూ ఎంజాయ్ చేస్తారు,” అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు.