నంది అవార్డులకు బదులు ప్రజాగాయకుడు దివంగత గద్దర్ పేరిట సినీ అవార్డులను అందజేస్తామనే సిఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకి తెలుగు సినీ పరిశ్రమ కూడా సానుకూలంగా స్పందించడంతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
గద్దర్ అవార్డులకు విధివిధానాలను రూపొందించేందుకు ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు అధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (వి.వెంకటరమణ రెడ్డి) ఈ కమిటీకి వైస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
ఈ కమిటీలో అందెశ్రీ, కె.రాఘవేంద్ర రావు, తమ్మారెడ్డి భరద్వాజ, అల్లు అరవింద్, డి.సురేశ్ బాబు, తనికెళ్ళ భరణి, ఆర్. నారాయణ మూర్తి, కె చంద్రబోస్, వందేమాతరం శ్రీనివాస్, ఎల్దండి వేణు, హరీష్ శంకర్, అల్లాణి శ్రీధర్, సానా యాదిరెడ్డి, గుమ్మడి వెన్నెల సలహా సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమీషనర్ హనుమంతరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
గద్దర్ సినీ అవార్డుల కమిటీలో కాంగ్రెస్ నాయకులతో నింపేయకుండా సినీ పరిశ్రమకు చెందినవారికే ఈ బాధ్యత అప్పగించడం చాలా మంచి నిర్ణయం.
కమిటీలో సభ్యులు అందరూ సినీ పరిశ్రమలో అన్ని శాఖల గురించి ఎంతో అవగాహన, అనుభవం ఉన్నవారే. కనుక అవార్డుల ఎంపికకి ఈ కమిటీ చక్కటి విధివిధానాలు రూపొందించగలదు. ప్రభుత్వం కూడా వాటికి కట్టుబడి గద్దర్ అవార్డులను ప్రకటిస్తే ఆ అవార్డులకి మరింత విలువ పెరుగుతుంది. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం ఈ ఏడాది డిసెంబర్ నుంచే ప్రారంభిస్తామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.