త్వరలో ఓజీ టీజర్‌ పక్కా: డీవీవీ దానయ్య

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలోకి వెళ్ళి ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి అవడంతో ఇదివరకు మొదలుపెట్టిన మూడు సినిమాలు పూర్తిచేయలేకపోతున్నారు.

తమ అభిమాన హీరో ఉప ముఖ్యమంత్రి అయ్యాడని సంతోషించాలో లేక ఆయన సినిమాలు రాకపోవడంతో బాధ పడాలో తెలీని పరిస్థితిలో ఉన్నారు అభిమానులు. అయితే వారికి సంతోషం కలిగించే ఓ శుభవార్త నిర్మాత డీవీవీ దానయ్య చెప్పారు.

నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు స్వయంగా నానీయే ఆయనని సెప్టెంబర్‌ 2న పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజునాడైనా ‘ఓజీ’ టీజర్‌ విడుదల చేస్తున్నారా లేదా సార్?” అని అడిగేశారు.

నిర్మాత దానయ్య కూడా ఏమాత్రం తడబడకుండా ‘తప్పకుండా’ అని సమాధానం చెప్పారు. అంతే కాదు... పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ ‘ఓజీ’కి సమయం కేటాయించారని త్వరలోనే షూటింగ్‌ ప్రారంభిస్తామని చెప్పారు. ఈ అక్టోబర్ నుంచి ‘ఓజీ’ షూటింగ్‌లో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొనబోతున్నట్లు సమాచారం.

పవన్‌ కళ్యాణ్‌ బిజీ షెడ్యూల్ దృష్టిలో ఉంచుకొని ముందుగా ఆయన పాత్రకు సంబందించిన సన్నివేశాలను చిత్రీకరించి, ఆ తర్వాత మిగిలిన భాగాన్ని షూటింగ్‌ చేస్తారు.

సుజీత్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఓజీ’లో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్‌ ఉత్తమన్, అభిమన్యు సింగ్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.

రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.