
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. కనుక ఆయన నటిస్తున్న విశ్వంభర సినిమా టీజర్ విడుదలవుతుందని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ టీజర్ విడుదల చేయడం లేదని దర్శకుడు మల్లాది వశిష్ట స్పష్టం చేశారు.
విశ్వంభర వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది కనుక షెడ్యూల్ ప్రకారమే టీజర్ విడుదల చేస్తామని చెప్పారు. తాను చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానిని అని కనుక ఓ అభిమానిగా చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నానో అలా ఈ సినిమాలో చూపబోతున్నానని దర్శకుడు వశిష్ట చెప్పారు. ఓ అభిమానిగా చిరంజీవితో సినిమా చేసే అదృష్టం కలుగుతుందని ఎన్నడూ అనుకోలేదని విశ్వంభరతో ఆ అవకాశం లభించిందని అన్నారు.
సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కిస్తున్న విశ్వంభరలో ఊహించని అనేక సన్నివేశాలుంటాయని అవి చిరంజీవి అభిమానులకు చాలా సంతోషం కలిగిస్తాయని చెప్పారు.
ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబుగా నటిస్తున్నారు. హీరోయిన్లుగా త్రిష, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇషా చావ్లా, సురభి, ఆషికా రంగనాధ్, మరో ఇద్దరు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలుంటాయి.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న విశ్వంభర 2025, జనవరి 10న సంక్రాంతి పండుగకు ముందు విడుదల కాబోతోంది.