ప్రభాస్ తాజా సినిమా కల్కి ఎడి2898 ప్రపంచవ్యాప్తంగా భారీ కలక్షన్స్ రాబట్టి సూపర్ డూపర్ హిట్ అయితే ఆ సినిమాలో ప్రభాస్ పాత్ర ఓ జోకర్‌లా ఉందని బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలపై ఆభిమానులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా అర్షద్ వార్సీ వ్యాఖ్యలను తప్పు పట్టారు. “ఎవరైనా సినిమాలపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు. కానీ అవి విమర్శనాత్మకంగా ఆలోచింపజేసేవిగా ఉండాలే తప్ప ఎవరినో కించపరుస్తున్నట్లు ఉండకూడదు. కనుక సినిమాలపై తమ అభిప్రాయాలు తెలిపేవారు ఆమోదయోగ్యమైన భాషలో తెలిపితే బాగుంటుంది.
మాకు మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లోని అర్షద్ వార్సీ చేసిన సర్క్యూట్ కావాలి తప్ప ఇలాంటి షార్ట్ సర్క్యూట్ కాదు. ప్రభాస్ స్థాయి హీరోని అవహేళన చేసే కంటే అర్షద్ వార్సీ తన కెరీర్ మీద దృష్టి పెడితే మంచిది. ఇటువంటి వ్యాఖ్యలు సరికాదు,” అని ట్వీట్ చేశారు.
సాధారణంగా ప్రతీ సినిమాలో హీరోని గొప్పగా ఎలివేషన్ చేస్తూ ఏదో సూపర్ మ్యాన్ అన్నట్లు చూపిస్తుంటారు. కానీ నాగ్ అశ్విన్ అందుకు భిన్నంగా కూడా ప్రభాస్‌ని వేరే కోణంలో కూడా చూపించవచ్చని నిరూపించారు.
కల్కి ఎడి2898తో భారతీయ మూలాలు కలిగిన ఓ సినిమాని అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోని విదంగా చూపించవచ్చని దర్శకుడు నాగ్ అశ్విన్ నిరూపించి చూపారు.
కల్కి ఎడి2898 సినిమాని చూసి విదేశీ ప్రేక్షకులు సైతం జేజేలు పలుకుతుంటే, అర్షద్ వార్సీ కోడిగుడ్డుకి ఈకలు పీకే ప్రయత్నం చేస్తుండటం దురదృష్టకరమే.