అందరూ కలిసే పంక్చర్ చేశాము: మెహర్ రమేష్

మెహర్ రమేష్ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌ హీరోగా 2011లో వచ్చిన ‘శక్తి’ అట్టర్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. ఎప్పుడో వచ్చిన ఆ సినిమా గురించి కొంతకాలం క్రితం మెహర్ రమేష్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ మెహర్ రమేష్ ఏం చెప్పారంటే, “అది నేను వ్రాసుకున్న చెప్పిన కధ కానేకాదు. ఓ టూరిస్ట్ గైడ్ రూపంలో ఓ కమెండో హోమ్ మినిస్టర్ కూతురిని కాపాడుతాడు. అతనితో ఆమె ప్రేమలో పడుతుంది. ఇదీ నేను సింపుల్‌గా అశ్వినీ దత్ గారికి చెప్పిన కధ. 

అయితే ఆ సమయంలో జూ.ఎన్టీఆర్‌ బృందావనం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నందున, ఆలోగా ఈ కధకి మరికాస్త మెరుగులు దిద్దితే బాగుంటుందని నాకు కొంతమంది ప్రముఖ రైటర్లతో కూర్చోపెట్టారు. వారందరూ కలిసి ఈ సినిమాని సోషియో ఫ్యాంటసీ కధగా మార్చేశారు. 

అసలు వారి కాన్సెప్ట్, ఆ కధ రెండూ నాకు అర్ధం కాలేదు. కనుక దాని నుంచి తప్పించుకునేందుకు దీంతో మరో సినిమా తీద్దామని నచ్చజెప్పేందుకు ప్రయత్నించాను. కానీ ఎవరూ వినలేదు. దాంతోనే ‘శక్తి’ తీసి బోర్లాపడ్డాము. 

‘బిల్లా’ సినిమాలో అందరం కలిసి పనిచేసి మంచి ఫలితం సాధించిన్నట్లే, ‘శక్తి’ సినిమాలో అందరం కలిసి పంక్చర్ చేసేశాము. అయితే సినిమా ఫ్లాప్ అయితే అది నా నెత్తినే పడుతుంది కనుక శక్తి ఫెయిల్యూర్ నా ఖాతాలోనే పడింది. ఏం చేస్తాం ఒక్కోసారి అలా జరిగిపోతుంటుంది,” అనిమెహర్ రమేష్ అన్నారు.