ఆగస్ట్ 15వ తేదీన విడుదల కావల్సిన పుష్ప-2 సినిమా అనివార్య కారణాల వలన డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడింది. అయితే డిసెంబర్ 6వ తేదీన కూడా విడుదల కాకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ తన బడ్డీ సినిమా ప్రమోషన్స్ లో దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నంలో మాట్లాడిన మాటలు వాటిని ఖండించేవిదంగా కాకుండా బలపరుస్తున్నట్లు ఉన్నాయి.
ఇంతకీ శిరీష్ ఏమన్నాడంటే, “పుష్ప-2 మళ్ళీ వాయిదా పడుతుందంటూ వినిపిస్తున్న ఊహాగానాలు నా చెవిన కూడా పడ్డాయి. మీరు వాటిని నమ్మకండి. సుకుమార్ ఈ సినిమాని చాలా అద్భుతంగా చెక్కుతున్నారని ఇండస్ట్రీలు అందరూ అనుకుంటుంటే విని మీకు చెపుతున్నాను తప్ప ఇది మా అన్నయ్య సినిమా అని నేను ఇలా చెప్పడం లేదు. పుష్ప-2 మీ అంచనాలకు మించి ఉంటుంది. కనుక పుష్ప-2 డిసెంబర్ 6వ తేదీన వచ్చినా ఎప్పుడు వచ్చినా మీ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించాలి,” అని అన్నారు.
పుష్ప-2 డిసెంబర్ 6వ తేదీన ఖచ్చితంగా విడుదలవుతున్నట్లయితే శిరీష్ అదే విషయం ఖచ్చితంగా చెప్పాలి. కానీ ‘డిసెంబర్ 6వ తేదీన వచ్చినా ఎప్పుడు వచ్చినా’ అంటే సినిమా మళ్ళీ వాయిదా పడబోతోందని చెపుతున్నట్లు ఉంది. కనుక పుష్ప-2 టీమ్‌లో ఎవరో ఒకరు ముందుకు వచ్చి సినిమా ఖచ్చితంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెపితే మంచిది.