జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ గొప్పదనం గుర్తించిందా?

బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ దేవర సినిమాతో తొలిసారిగా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ తర్వాత రామ్ చరణ్‌ తదుపరి సినిమా చేయబోతోంది. తాజాగా నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో మరో సినిమాకు సంతకం చేసిన్నట్లు తాజా సమాచారం.

ఒకప్పుడు బాలీవుడ్‌ నటీనటులకు టాలీవుడ్‌ అంటే చాలా చిన్న చూపు ఉండేది. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారీ కలక్షన్స్‌ సాధిస్తూ, ఆస్కార్ అవార్డు స్థాయికి ఎదగడంతో, బాలీవుడ్‌ నటీనటులు టాలీవుడ్‌పై ఆసక్తి చూపుతున్నారు.

అలాగే ఇప్పుడు టాలీవుడ్ పెద్ద హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీలుగానే నిర్మిస్తున్నారు కనుక ఉత్తరాది, దక్షిణాది ప్రజలకు పరిచయం ఉన్న బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్ నటీనటులను వాటిలో తీసుకుంటున్నారు. 

ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో తీస్తున్న 'దేవర' కూడా అటువంటిదే కావడంతో జాన్వీ కపూర్‌ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్‌లో అడుగుపెట్టి ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు అందుకుంటోంది. అలాగే తమిళంలో కూడా సినిమాలు అంగీకరిస్తూ దక్షిణాది రాష్ట్రాలలో కూడా మంచి పాపులర్ అవుతోంది. 

 దేవర సినిమాలో జూ.ఎన్టీఆర్‌కు జోడీగా నటిస్తున్న జాన్వీ కపూర్‌, ఓ జాలారి కుటుంబానికి చెందిన సాధారణ యువతిగా చేస్తోంది. బాలీవుడ్‌లో గ్లామర్ పాత్రలు చేసే జాన్వీ కపూర్‌ తెలుగులో మొదటి సినిమాలోనే ఇటువంటి పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం ఆశ్చర్యకరమే. కానీ ఆమె తీసుకున్న ఈ నిర్ణయం వలన టాలీవుడ్‌లో వరుసపెట్టి సినిమా ఆఫర్లు వస్తున్నాయి.