తెలుగు సినీ పరిశ్రమకు మళ్ళీ మంచి రోజులు షురూ

గత 5 ఏళ్ళలో ఏపీ మాజీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి తెలుగు సినీ పరిశ్రమని ‘ఫుట్ బాల్’ఆడుకున్నారు. టికెట్స్ రేట్స్ పెంచమని చిరంజీవి, రాజమౌళి తదితరులు వెళితే వారిని చాలా అవమానించారు. సినీ నియంత్రణ చట్టం పెరుతూ సినీ పరిశ్రమని ముప్పతిప్పలు పెట్టారు. 

ఇక జగన్‌ స్వయంగా పవన్‌ కళ్యాణ్‌ని ఎంతగా అవమానించారో లెక్కేలేదు. రజనీకాంత్‌కు ఏపీ రాజకీయాలతో సంబంధం లేనప్పటికీ ఆయన చంద్రబాబు నాయుడుని పొగిడినందుకు వైసీపి నేతలు ఆయనని దూషించారు. సినీ పరిశ్రమకే చెందిన పోసాని, రాంగోపాల్ వర్మ, రోజాల చేత కూడా తమకు నచ్చనివారిని తిట్టించారు. జగన్‌ 5 ఏళ్ళ పాలనలో సినీ పరిశ్రమకు గడ్డుకాలమే అని చెప్పవచ్చు. 

కానీ ఇప్పుడు ఏపీ సిఎం, డెప్యూటీ సిఎంలుగా చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ బాధ్యతలు చేపట్టడంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ మంచిరోజులు మొదలయ్యాయి. అందుకు తొలి సంకేతంగా ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ హైదరాబాద్‌ వచ్చి, ‘విశ్వంభర’ సినిమా షూటింగ్‌లో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ పరిశ్రమకు అవసరమైన సహాయసహకారాలు అందిస్తానని మాటిచ్చారు.

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌, ఇప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి ఇద్దరూ కూడా తెలుగు సినీ పరిశ్రమకి, సినీ ప్రముఖులకి సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇస్తున్నారు. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో సినీ పరిశ్రమకు మంచిరోజులు మొదలయ్యాయని భావించవచ్చు.