ఒకప్పుడు పెద్ద హీరోల పక్కన కామెడీ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సునీల్, క్యారక్టర్ ఆర్టిస్టుగా వేయడం మొదలుపెట్టిన తర్వాత క్షణం తీరిక లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఇప్పుడు విలన్ పాత్రలకు, పోలీస్ ఆఫీసర్ పాత్రల కోసమే దర్శకనిర్మాతలు సునీల్‌ని బుక్ చేసుకుంటున్నారు. టాలీవుడ్‌లో మొదట ఫ్యామిలీ హీరోగా సినిమాలు చేస్తూండే జగపతి ఒక్కరే ఈవిదంగా విజయవంతంగా సెకండ్ ఇన్నింగ్స్ చేస్తున్నారు.
పుష్ప-1లో విలన్‌గా మెప్పించిన సునీల్ త్వరలో విడుదలకాబోతున్న పుష్ప-2లోనూ విలన్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హలో జరుగుతుండటంతో దానిలో తన సన్నివేశాలు పూర్తి చేసి వెంటనే విమానం ఎక్కి రాజమండ్రిలో గేమ్ చేంజర్ సినిమాలో నటించడానికి బయలుదేరుతారు లేదా గేమ్ చేంజర్‌లో తన పని పూర్తికాగానే విమానం ఎక్కి హైదరాబాద్ చేరుకొని అక్కడ పుష్ప-2కి హై చెప్పేసి మళ్ళీ విమానం ఎక్కి గోవా చేరుకొని అక్కడ బాలీవుడ్ మూవీ మ్యాడ్-2 షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
ఈ సినిమాలు చేస్తుండగానే సుధీర్ బాబు హీరోగా వచ్చిన హరోంహర సినిమా కూడా పూర్తి చేసేశారు. ఈ సినిమాలో సస్పెండ్ అయిన పోలీస్ కానిస్టేబుల్ పళనిగా పూర్తి నిడివిగల పాత్ర చేశారు.
సునీల్ ఒకటి రెండు తమిళ సినిమాలు కూడా ఒప్పుకున్నారు. త్వరలో ఓ మళయాళం సినిమా కూడా చేయబోతున్నారు. కనుక మరో ఏడాది వరకు తెలుగు సినిమా నిర్మాతలకు సునీల్ డేట్స్ దొరకడం కష్టమేనని తెలుస్తోంది.