కల్కి ప్రమోషన్ చాలా వెరైటీగా సాగుతోందే!

ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సిద్దమవుతున్న కల్కి ఎడి2898 సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. దర్శక నిర్మాతలు ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్న విధానం కూడా చాలా వెరైటీగా ఉంది.

ఈ సినిమాలో భైరవగా నటిస్తున్న ప్రభాస్‌ ఉపయోగించిన ‘బుజ్జి’ రోబో వాహనాన్ని దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలలో సామాన్య ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. నేడు రేపు (శని,ఆదివారం) రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో పత్రికా గేట్, జల్ మహల్ వద్ద ప్రదర్శనకు పెట్టారు.

కేవలం సినిమాలో మాత్రమే చూడగలిగే ఆ వాహనం కళ్ళ ఎదుటే కనిపిస్తుండటంతో ప్రజలు దాంతో ఫోటోలు దిగుతున్నారు. యువతీ యువకులు చాలా ఉత్సాహంగా     బుజ్జి వాహనంలో కూర్చొని ఫోటోలు దిగుతున్నారు. 

కల్కి ఎడి2898 నుంచి నేడు ఓ పాట విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించడంతో అభిమానులు దాని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పడుకొనే, దిశా పటానీ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న కల్కి ఏడి సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్ బచ్చన్, కోలీవుడ్‌ నటుడు కమల్ హాసన్, రానా దాగుబాటి, దుల్కర్ సల్మాన్, పశుపతి, శాశ్వత చటర్జీ, అన్నా బెన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,  సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.      

రూ.600 కోట్ల బారీ బడ్జెట్‌తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై సి. అశ్వినీ దత్ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.