దేవర ముందే రాబోతున్నాడట?

కొరటాల శివ దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేస్తున్న దేవర సినిమాకి సంబందించి ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన విడుదల కావలసి ఉండగా పది రోజుల ముందే సెప్టెంబర్‌ 27వ తేదీనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. 

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలో బిజీ అయిపోవడంతో హరీష్ శంకర్‌ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు కనుక మున్ముందు ఇంకా బిజీ అయిపోవచ్చు. కనుక ముందుగా ఈ సినిమాని పూర్తి చేసి అక్టోబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఉస్తాద్ భగత్ సింగ్, దేవర రెండు సినిమాలపై చాలా భారీ అంచనాలు ఉన్నందున ఒకేసారి విడుదల చేస్తే రెండూ నష్టపోయే ప్రమాదం ఉంది కనుక దేవరని పది రోజులు ముందుగా విడుదల చేయాలని నిర్ణయించిన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని ఇంకా దర్శక నిర్మాతలు ధృవీకరించ వలసి ఉంది.

దేవర సినిమాలో బాలీవుడ్‌ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నారాయణ్, రమ్యకృష్ణ, చైత్ర రాయ్, కలైయరసన్‌, షైన్ టామ్ చాకో తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కొరటాల శివ, సంగీతం: అనిరుధ్ రవిచంద్ర, కెమెరా:ఆర్‌. రత్నవేలు, ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు.     

యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు.