
ఒకప్పుడు అల్లరి నరేష్ అంటే కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్లు ఉండేవాడు. కానీ ఇండస్ట్రీలో సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ క్రమంగా విలక్షణమైన కధలు, పాత్రలు ఎంచుకొని చేస్తూ అందరినీ మెప్పిస్తున్నాడు. తాజాగా ‘బచ్చల మల్లి’ సినిమాలో అదే పేరు, పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈరోజు ఆ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఓ రిక్షాలో కూర్చొని తాపీగా సిగరెట్ కాలుస్తున్న ఫోటో అది. దానిలో నరేష్ పేరు: మల్లి. ఇంటిపేరు బచ్చల, చేసేది ట్రాక్టర్ డ్రైవింగ్. ఈ బచ్చల మల్లి ఖచ్చితంగా మీకు చాలా చాలా రోజులు గుర్తుండి పోతాడు... ఆరడుగుల మూర్ఖుడు” అంటూ పరిచయం చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్నాడని ఈ సినిమాని నిర్మిస్తున్న హాస్యా మూవీస్ తెలియజేసింది.
ఈ సినిమాలో నరేష్‌కు జోడీగా అమృత అయ్యర్ నటిస్తోంది. రావు రమేష్, కోటా జయరాం, సాయి కుమార్, ధన్‌రాజ్, హరితేజ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి దర్శకుడు: సుబ్బు మంగదేవి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం నాధన్, ఎడిటింగ్: చోట కె ప్రసాద్, స్క్రీన్ ప్లే: విపర్తి మధు చేస్తున్నారు.
అల్లరి నరేష్ 63వ సినిమాగా వస్తున్న బచ్చల మల్లిని రాజేష్ దండ, బాలాజీ గుట్ట కలిసి హాస్య మూవీఎస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.