
గామి సినిమాతో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఇప్పుడు గోదావరి జిల్లాల నేపధ్యంలో ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’తో ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కనుక శనివారం సాయంత్రం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
సినిమా పేరులోనే పక్కా మాస్ అని చెప్పేశారు. అంతకంటే ఎక్కువే ఉంటుందని ట్రైలర్ చెప్పేసింది. గోదావరి జిల్లాల కధతో సినిమా అంటే శతమానం భవతి వంటి సినిమాలనే భ్రమని ఈ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో దర్శకుడు కృష్ణ చైతన్య, విశ్వక్ సేన్ కలిసి పూర్తిగా తొలగించేసిన్నట్లే కనబడుతోంది.
1980లలో గోదావరి జిల్లాలలో జరిగిన రాజకీయాలు, ఎన్నికలు, రౌడీయిజంతో దర్శకుడు ఈ కధ అల్లుకున్నట్లు ట్రైలర్‌తో తెలుస్తోంది.
అంతేగాదు... ట్రైలర్‌లోనే బూతులు దట్టించి ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌లో “బూతులు కాస్త ఎక్కువయ్యాయా?” అని ప్రేక్షకులను అడిగారు కూడా. విశ్వక్ సేన్ ఈ సినిమాతో తనలో మరో యాంగిల్ కూడా ఉందని చూపించాడు.
ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అంజలి ఓ ప్రధాన పాత్ర చేస్తోంది. దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి సీతార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి సంగీతం: యువన్ శంకర్ రాజా, కెమెరా: అనిత్ మదాడి, ఆర్ట్: గాంధీ నడికుండికర్, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.