నాగ చైతన్య కూడా బుజ్జిపై మనసుపడ్డాడే!

ప్రభాస్‌ హీరోగా వస్తున్న కల్కి ఎడి2898 సినిమా కోసం అనేక మంది ఇంజనీరింగ్ నిపుణులు ఎంతో శ్రమపడి బుజ్జి అనే అద్భుతమైన వాహనం తయారుచేశారు.  రెండు రోజుల క్రితమే బుజ్జీని కూడా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ఈవెంట్ నిర్వహించారు.

సాధారణంగా సినిమాల కోసం తయారుచేసే ఇటువంటి వాహనాలు ఆ సినిమాలో షో చేయడానికే తప్ప నిజంగా బయట తిప్పడానికి పనికి రావు. కానీ ఈ ఈవెంట్‌లో ప్రభాస్‌ స్వయంగా ‘బుజ్జీ’ని నడిపిస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

అప్పటి నుంచే బుజ్జి వాహనం గురించి వివరాలు తెలుసుకునేందుకు అందరూ చాలా ఆసక్తి చూపుతున్నారు. సినీ నటుడు నాగ చైతన్య బుజ్జీ కోసమే ప్రత్యేకంగా రామోజీ ఫిలిమ్ సిటీకి వెళ్ళి , కల్కి టీమ్‌ అనుమతి తీసుకొని అక్కడ దాని కోసమే ప్రత్యేకంగా నిర్మించిన రేసింగ్ ట్రాక్ మీద శరవేగంగా దూసుకుపోయారు.

తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “బుజ్జీ మహాద్బుతంగా ఉంది. దానిని నడిపించడం గొప్ప అనుభూతి కలిగించింది. ఇంజనీరింగ్‌లో అన్ని పరిమితులను అధిగమించి బుజ్జీని తయారు చేసిన్నట్లు నాకు అనిపించింది,” అని అన్నారు. 

నాగ చైతన్య బుజ్జీని నడుపుతున్నప్పుడు తీసిన వీడియోని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నారు. 

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా సిద్దమవుతున్న కల్కి ఎడి2898 జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో ప్రభాస్‌ భైరవగా నటిస్తుండగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్ బచ్చన్, కోలీవుడ్‌ నటుడు కమల్ హాసన్, రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, పశుపతి, శాశ్వత చటర్జీ, అన్నాబెన్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,  సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.      

రూ.600 కోట్ల బారీ బడ్జెట్‌తో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీ దత్ పాన్ ఇండియా మూవీగా దీనిని నిర్మిస్తున్నారు.