కన్నప్పలో నాకు తగిన పాత్ర లేదనుకుంటా అందుకే...

మంచు లక్ష్మి తన కూతురు చదువు, తన కెరీర్‌ కోసం ముంబాయికి మకాం మార్చిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమని వదిలేసి వెళ్లిపోయారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆమె ‘యక్షిణి’ అనే వెబ్‌ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. 

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారు పాల్గొని పట్టుబడటంపై అడిగిన ప్రశ్నకు జవాబుగా “ఇప్పుడు దాని గురించి మాట్లాడుకునే సమయం, సందర్భం కాదు. ఇండస్ట్రీలో ఎవరో ఎక్కడికో వెళితే అది వారి సమస్య. దాంతో నాకు సంబంధం లేదు. నాకు నా కుటుంబం, నా కెరీరే ముఖ్యం. మిగిలిన విషయాలు నాకు అనవసరం,” అని అన్నారు. 

మంచు విష్ణు తన కన్నప్ప సినిమాలో మీకు అవకాశం ఇవ్వలేదా? అనే ప్రశ్నకు “బహుశః ఆ సినిమాలో నాకు తగిన పాత్ర ఉండి ఉండక పోవచ్చు. అందుకే నన్ను అడగలేదేమో? మనోజ్‌ని కూడా అడగలేదు. అందరం చేసి ఉంటే అది కన్నప్ప అవ్వదు... మా ఫ్యామిలీ సినిమాగా మారిపోతుంది,” అని మంచు లక్ష్మి అన్నారు. 

సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ, “అది ఎప్పుడూ ఉండేదే. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నేను ఎప్పుడూ ముక్కు సూటిగా మాట్లాడుతుంటాను. నా మాటలు కొందరి నచ్చుతాయి. కొందరికి నచ్చకపోవచ్చు. అందరూ నా అభిప్రాయాలతో ఏకీభవించాలని నేనేమీ చెప్పడం లేదు కదా? నా అభిప్రాయాలూ నేను చెపుతుంటాను అంతే. రాజకీయాలలో దేని గురించి ఏవిదంగా మాట్లాడితే ఏమవుతుందో తెలీకపోవడం వలన ట్రోలింగ్ అవుతుంటాను. మొదట్లో బాధపడినప్పటికీ ఇప్పుడు వాటిని పట్టించుకోవడం మానేశాను. నా కుటుంబం, నా కెరీర్‌ ఇది చాలు నాకు,” అని మంచు లక్ష్మి అన్నారు. 

మంచు లక్ష్మి, అజయ్, వేదిక యక్షిణి వెబ్‌ సిరీస్‌లో ముఖ్య పాత్రలు చేశారు. తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ వెబ్‌ సిరీస్‌ జూన్ 14 నుంచి డిస్నీ హాట్ స్టార్ ప్లస్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది.