
సూపర్ హిట్ బేబి సినిమాలో హీరోయిన్గా చేసి అందరినీ మెప్పించిన వైష్ణవి చైతన్య, ఆశిష్ ప్రధాన పాత్రలలో ‘లవ్ మీ... ఇఫ్ యూ డేర్’ అనే రొమాంటిక్ హర్రర్ సినిమా పూర్తి చేశారు. ఆ సినిమా ట్రైలర్ విడుదలైంది. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే దెయ్యంతో హీరో ప్రేమలో పడటం. అందుకే సినిమాకి ఇటువంటి టైటిల్ పెట్టారు. ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఈ సినిమాకి సంగీతం ఎంఎం కీరవాణి, కెమెరా: పీసీ శ్రీరామ్, ఆర్ట్: అవినాష్ కొల్ల చేశారు. దిల్‌రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై హర్షిత రెడ్డి, హంషిత రెడ్డి, నాగ మల్లాది కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు శిరీష్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 25వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది.
హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పాల్గొని మాట్లాడుతూ, “నిర్మాత దిల్‌రాజు తన సినిమాలలో ఎంతో మంది కొత్త దర్శకులు, నటీ నటులకు అవకాశాలు కల్పిస్తుంటారు. దర్శకత్వంలో అనుభవం లేనివారితో సినిమాలు తీయగల ధైర్యం కేవలం దిల్‌రాజుకి మాత్రమే ఉంది. నేనైతే అంత రిస్క్ చేయలేను,” అని అన్నారు.
ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్న అరుణ్ భీమవరపు మాట్లాడుతూ, “నాకు ఈ అవకాశం ఇచ్చి నాతో ఈ సినిమా తీసిన నిర్మాత దిల్‌రాజుగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. తొలి సినిమాలోనే కీరవాణి, పీసీ శ్రీరామ్ వంటి హేమాహేమీలతో పనిచేసే అదృష్టం లభించినందుకు చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు.
నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ, “సినిమాలపై ఆసక్తితో హర్షిత్ రెడ్డి నిర్మాతగా మారితే, హన్షిత చిన్నప్పటి నుంచే సినిమా షూటింగ్‌లకు వెళుతూ ఆసక్తి పెంచుకుంది. కానీ సినీ రంగంలోకి వస్తుందని ఊహించలేకపోయాను. మంచి టాలెంట్ ఉన్న యువకులు చాలా మందే ఉన్నారు. వారికి మా సినిమాలతో అవకాశం కల్పిస్తూ ప్రోత్సహించాలనే ఆశయంతోనే వారితో సినిమాలు చేస్తున్నాము,” అని అన్నారు.