వినాయక్ చేతిలో పడుతున్న గోపిచంద్..!

మాస్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో గోపిచంద్. సౌఖ్యం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరో ప్రస్తుతం ఆక్సీజన్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఇక ఆ తర్వాత కూడా కథలైతే వస్తున్నా సరైన కథ కోసం చూస్తున్నాడట గోపిచంద్. తెలుస్తున్న సమాచారం ప్రకారం గోపిచంద్ వినాయక్ డైరక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడట.

ప్రస్తుతం ఖైది నెంబర్ 150 సినిమా చేస్తున్న వినాయక్ ఆ సినిమా పూర్తి కాగానే గోపిచంద్ తో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడట. అయితే ఈ కాంబినేషన్ ను కుదుర్చింది నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి అని తెలుస్తుంది. వినాయక్ కు బాగా దగ్గరైన రవిందర్ రెడ్డి తనకు ఓ సినిమా చేయాలని అన్నాడట. దానికి ఓకే చెప్పడంతో తన దగ్గర గోపిచంద్ డేట్స్ ఉండటంతో అతనితోనే ఓ మాస్ మసాలా మూవీ చేయబోతున్నారట.

సినిమాలో హీరో పోలీస్ పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. స్టార్ డైరక్టర్స్ తో సినిమా చేయాలని కలలు కంటున్న గోపిచంద్ అప్పట్లో పూరితో గోలీమార్ చేసినా తన కెరియర్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు. మరి వినాయక్ అయినా గోపిచంద్ ఫేట్ మార్చే హిట్ అందిస్తాడేమో చూడాలి.