
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలలో వచ్చిన సలార్ సినిమాకు సీక్వెల్ రాబోతోందని అందరికీ తెలుసు. కానీ ఆ సినిమా ప్రకటన తర్వాత దానికి సంబందించి ఎటువంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాలో నటిస్తున్న పృధ్వీరాజ్ సుకుమారన్, బాబీ సింహా ఇద్దరూ రెండు కొత్త విషయాలు చెప్పారు. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమైందని ఏప్రిల్ నెలాఖరు లేదా మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని బాబీ సింహా చెప్పారు.
ఈ సినిమాని ఎప్పుడు మొదలుపెట్టినా ఖచ్చితంగా2025లోనే విడుదలవుతుందని పృధ్వీరాజ్ సుకుమారన్ చెప్పారు. అయితే 2025లో ఎప్పుడనేది దర్శక నిర్మాతలు నిర్ణయిస్తారని చెప్పారు. సలార్-2 షూటింగ్ మొదలైతే ప్రస్తుతం తాను చేస్తున్న ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా షూటింగ్‌లో కొన్ని రోజులు బ్రేక్ తీసుకొంటానని పృధ్వీరాజ్ సుకుమారన్ చెప్పారు.
ప్రభాస్ నటిస్తున్న కల్కి ఎడి2898 మే 9న విడుదల కావలసి ఉంది. కానీ ఆ సమయంలో దేశంలో ఎన్నికల హడావుడి ఉంటుంది. ముఖ్యంగా మే 13న ఏపీ శాసనసభ ఎన్నికలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతుంటాయి. కనుక (జూన్ 4న) పోలింగ్ పూర్తయ్యే వరకు కల్కి ఎడి2898 వాయిదా పడే అవకాశం ఉంది.