ఉగాదికి రవితేజ కొత్త సినిమా ప్రకటన వచ్చిందిగా!

ఇండస్ట్రీలో హిట్లు ఫట్లను పట్టించుకోకుండా ముందుకు సాగిపోయే హీరోలలో స్ మహారాజ రవితేజ కూడా ఒకరు. ఎంతో ఆశపెట్టుకొన్న టైగర్ నాగేశ్వర రావు ఫ్లాప్ కాగా, భారీ అంచనాలతో వచ్చిన ఈగల్ సినిమా హిట్ అయ్యింది. దాని తర్వాత హరీష్ శంకర్‌ దర్శకత్వంలో ‘మిస్టర్ బచ్చన్’ అనే మరో సినిమా వెంటనే మొదలుపెట్టేశాడు.

ఈ సినిమా పూర్తవక మునుపే నేడు ఉగాది పండుగ సందర్భంగా రవితేజ 75వ సినిమా ప్రకటన వచ్చేసింది. ప్రముఖ రచయిత బొగ్గవరపు భాను ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు. 

ఈ సినిమాని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్: నవీన్ నూలి చేయబోతున్నారు. సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను శ్రీకార స్టూడియోస్ సమర్పిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు పోస్టర్లో తెలియజేశారు. 

ఇక హరీష్ శంకర్‌ కాంబినేషన్‌లో చేస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజకు జోడీగా బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ బొర్సే నటిస్తోంది. పనోరమ స్టూడియోస్, టీ సిరీస్ స్టూడియోస్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్‌ అగ్నిహోత్రి కూచిబొట్ల కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం మిక్కీ జె. మేయర్ అందిస్తున్నారు.