కమల్ హాసన్ సినిమా.. జూన్‌లో.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు!

కమల్ హాసన్, రజినీకాంత్ ఇద్దరూ తమిళ్ హీరోలే అయినప్పటికీ వారిద్దరినీ మనవాళ్ళే అని తెలుగు ప్రజలు భావిస్తుంటారు. అంతగా ఇద్దరూ ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్నారు. రజనీకాంత్ నటించిన సినిమా ఏడాదికి ఒక్కటైనా తెలుగులో వస్తోంది కానీ కమల్ హాసన్ నటించిన సినిమాలు వచ్చి చాలా కాలమే అయ్యింది. మళ్ళీ చాలా కాలం తర్వాత కమల్ హాసన్ సినిమా ఇండియన్-2 జూన్ నెలలో రాబోతోంది. 

శంకర్ దర్శకత్వంలో మొదలుపెట్టిన ఈ సినిమాకు మొదటి నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతుండటంతో ఒకానొక సమయంలో సినిమా అటకెక్కిపోయింది కూడా. కానీ కమల్ హాసన్ మీద అభిమానం, నమ్మకంతో నిర్మాతలు పట్టుబట్టి ఈ సినిమాను ఎలాగో పూర్తి చేయించారు. 

ఈ సినిమాని జూన్ నెలలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది. 

ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర పేరు సేనాపతి వీరశేఖరన్. కాజల్ అగర్వాల్ ఆయనకు జంటగా నటించారు. సిద్ధార్థ్, ఎస్.జె.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, దీపా శంకర్, మనోబాల తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: ఎస్.శంకర్, సంగీతం: అనిరుధ్ రవిచందర్, కెమెరా: రవి వర్మన్, ఎడిటింగ్: అక్కినేని శ్రీకర్ ప్రసాద్. 

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీ బ్యానర్లపై సుభాస్కరన్ అల్లిరాజా, ఉద్యానిధి స్టాలిన్ కలిసి రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో తమిళంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.

ప్రభాస్‌ హీరోగా వస్తున్న కల్కి ఎడి2898 సినిమాలో కమల్ హాసన్ ఓ అతిధి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మే నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉంది. కనుక ఈ ఏడాది కమల్ హాసన్ నటించిన రెండు సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూడవచ్చన్న మాట!