విశ్వంభర యాక్షన్ సీన్స్... హైదరాబాద్‌లో అక్కడే!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లాది వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాకి సంబందించి అప్‌డేట్‌ వచ్చి చాలా కాలమే అయ్యింది. కళ్యాణ్ రామ్కు బింబిసార వంటి సూపర్ హిట్ ఇచ్చిన వశిష్ట, ఈసారి చిరంజీవికి ఉన్న మెగా ఇమేజ్‌ దృష్టిలో పెట్టుకొని అందుకు తగ్గట్లుగా కధ వ్రాసుకొని ఈ సినిమాని తీస్తున్నానని చెప్పారు.

ఈ సినిమాలో చిరంజీవి నట విశ్వరూపం మరోసారి అందరూ చూస్తారని చెప్పారు. చిరంజీవి, శ్రీదేవి జంటగా గతంలో జగదేక వీరుడు, అతిలోక సుందరి అనే సోషియో ఫ్యాంటసీ చేస్తే అది సూపర్ హిట్ అయ్యింది. అప్పుడు ఇంత అత్యాధునిక టెక్నాలజీ, గ్రాఫిక్స్, విజువల్స్ ఉండేవి కావు. కానీ ఇప్పుడు అవన్నీ అరచేతిలోనే ఉన్నాయి కనుక ఆ సినిమాకు మించి ఇంకా గొప్పగా తీసి చూపిస్తానని దర్శకుడు వశిష్ట చెపుతున్నారు.         

ప్రస్తుతం ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సీన్స్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ చేస్తున్నామని దానిలో స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్‌ అధ్వర్యంలో అనేకమంది పాల్గొంటున్నారని చెప్పారు. ఈ యాక్షన్ సీన్స్ విశ్వంభర సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాతలు చెప్పారు. 

ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబుగా నటిస్తున్నారు. త్రిష, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇషా చావ్లా, సురభి, ఆషికా రంగనాధ్, మరో ఇద్దరు ఆయన చెల్లెళ్ళుగా నటిస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా,  కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, సంగీతం: ఎంఎం కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. దీనిలో ఆరు        పాటలుంటాయని సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తెలిపారు. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, విక్రమ్, ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాను 2025, జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు విడుదల కాబోతోంది.