
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రోమోషన్స్లో భాగంగా విజయ్ దేవరకొండ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
రష్మికతో రిలేషన్షిప్లో ఉన్నట్లు వస్తున్న పుకార్ల గురించి అడిగి ఆమెతో రిలేషన్షిప్లో ఉన్నారా? అని అడిగినప్పుడు, “అవును రిలేషన్షిప్లో ఉన్నాను కానీ ఆమెతో కాదు.. నా తల్లితండ్రులు, సోదరుడు, స్నేహితులతో రిలేషన్షిప్లో ఉన్నాను,” అంటూ జవాబు చెప్పారు.
పేరు ముందు రౌడీ స్టార్ టైటిల్ గురించి అడిగినప్పుడు, “నా సినిమా నిర్మాతలు ఈ సాంప్రదాయం గురించి చెప్పి ఏం పెట్టమంటారు? అని అడిగేవారు. నాకు మా తల్లితండ్రులు పెట్టిన పేరు ఉండగా మరో పేరు ఎందుకు? అని అడిగేవాడిని. కానీ వారు సినిమాలలో ఇది తప్పనిసరి అని చెప్పి ఒత్తిడి చేస్తే పేరు ముందు ‘ది’ (The) అని మాత్రమే పెట్టమని చెప్పాను. కానీ అభిమానులే నాకు ‘రౌడీ స్టార్’ అంటూ ఓ బిరుదు తగిలించేశారు. వారిని కాదనలేము కదా? అందుకే ఆ బిరుదు కూడా భరిస్తున్నాను,” అని విజయ్ దేవరకొండ చెప్పారు.
ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి మాట్లాడుతూ, “గీతా గోవిందం తర్వాత మళ్ళీ పరశురాంతో కలిసి ఈ సినిమాలో పనిచేయడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఆయన తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ కధ వ్రాసుకున్నానని చెప్పాడు. ఈ సినిమా ప్రతీ ఒక్కరికీ తప్పకుండా నచ్చుతుందని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.